పక్క రాష్ట్రాల్లో 6 వేల ఎకరాల ఎండోమెంట్ భూములు!...

పక్క రాష్ట్రాల్లో 6 వేల ఎకరాల ఎండోమెంట్ భూములు!...
  • హద్దులు, సర్వే నంబర్లు లేక స్వాధీనానికి ఇబ్బందులు
  • అయోమయంలో దేవాదాయ శాఖాధికారులు
  • 3 వేల ఎకరాలు మఠం భూములేనంటున్న ఆఫీసర్లు
  • వివరాలు వెల్లడించని మఠాల ప్రతినిధులు
  • ఎలా ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో దేవుడి భూములు కబ్జాకు గురయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయ భూములపై ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ భూములున్నాయి? ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి? అన్యాక్రాంతమైన జాగలెన్ని? అనే లెక్కలు తీస్తోంది. రాష్ట్రంలో వివిధ ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాలున్నట్టు ఎండోమెంట్ గుర్తించింది. అందులో 25 వేల ఎకరాలు కబ్జా అయినట్టు నిర్ధారించింది.

మరో 6 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నట్టు తేలింది. సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల పరిధిలో ఆ 6 వేల ఎకరాలు ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. అయితే, ఇందులో 3 వేల ఎకరాల వరకు మఠం భూములు ఉన్నాయని, ఆ భూముల వివరాలు వెల్లడించడానికి మఠం ప్రతినిధులు ఇష్టపడడం లేదని దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు.    

ఏ భూమి ఎక్కడుందంటే.. 

ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ లో మొత్తం 6 వేలకుపైగా ఎండో మెంట్ భూములున్నట్టు రికార్డుల్లో ఉంది. ఇందులో 3 వేల ఎకరాలకు పైగా భూములు మఠాలకు సంబంధించినవని ఎండోమెంట్ అధికారులు చెప్తున్నారు. నారాయణపేట జిల్లా నేరేడ్గం మండలం మగనూరులోని సిద్ధిలింగేశ్వరస్వామి ఆలయానికి 1,137 ఎకరాల భూమి ఉండగా.. ఆ భూమి కర్నాటక రాష్ట్రంలో ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి 1,052.07 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయి.

గతంలో ఈ భూములపై వివాదం కూడా రాజుకుంది. జనగామ జిల్లా లింగాలఘన్ పూర్ లోని రామచంద్రస్వామి ఆలయానికి 12.19 ఎకరాల భూమి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో వట్టి చెరుకు మండలంలోని కొర్నెపాడు గ్రామంలో ఉన్నట్టు రికార్డులు పేర్కొంటున్నాయి. వరంగల్ పరిధిలోని రంగశాయిపేట గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి 8 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉంది.

ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామచంద్ర గోపాల కృష్ణమఠ్ కు 1,280.38 ఎకరాలు ఉంది. ఈ భూమి మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఖేలాపూర్ తాలుకా గోష్మి గ్రామంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లోని బాల బ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రానికి 20.17 ఎకరాలు ఉండగా.. అది ఏపీలోని కర్నూల్ జిల్లా జి.సింగవరం పరిధిలోని కల్లూరులో ఉంది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని మల్లేపల్లిలోగల సీతారాంభాగ్ సీతారామచంద్రస్వామి ఆలయానికి 2,492.17 ఎకరాల భూమి ఉండగా.. అది మహారాష్ట్రలోని అమరావతి, రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్ లో ఉన్నట్టు రికార్డుల్లో ఉంది.


 
నక్షలు, హద్దులు కరువు 

నాలుగు రాష్ట్రాల్లో కలిపి ఎండోమెంట్​కు 6.18 వేల ఎకరాల భూమి ఉండగా.. అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంది. అక్కడ దాదాపు 3,709.55 ఎకరాల (రాజస్థాన్ తో కలిపి) భూమి ఉంది. ఆ తర్వాత కర్నాటకలో 1,137 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ లో 1,092.43 ఎకరాల భూమి ఉంది. ఈ భూములకు సరిహద్దులు నిర్ణయించలేదు. నక్ష, హద్దులు, సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు.

అయితే, రికార్డుల్లో ఉన్న భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తే.. కబ్జాకు గురికాకుండా కాపాడినవారతారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2020 నుంచి దేవాదాయశాఖ తిరిగి 9,135.33 ఎకరాలు స్వాధీనం చేసుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 698.28 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్న 6 వేల ఎకరాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. 

ఆ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపేనా?  

ఏపీలో చంద్రబాబు, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇతర రాష్ట్రాల్లో భూముల స్వాధీనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలయ భూములపై ఆ రాష్ట్రాలతో చర్చలు జరిపి తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు లేదా ఆ భూములను అమ్మకానికి పెట్టి వచ్చిన ఆదాయంతో ఇక్కడ ఆలయాల అభివృద్ధికి కేటాయించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయిన తర్వాత కొలువు దీరిన ప్రభుత్వంతో చర్చించి.. అక్కడ కూడా స్వాధీనం చేసుకోవచ్చు. 6 వేల ఎకరాలు స్వాధీనం చేసుకుని.. లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. అయితే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది తెలియాల్సి ఉంది.